Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

కర్మానుష్ఠానం ఎందుకు?

మన కర్మకాండ కఠిననియమాలతో కూడుకొనివుంటుంది. ఇతరమతములం దిట్టివి లేవు. ఇంతకాలంగా మన పూర్వులు నియమపూర్వకంగా కర్మానుష్ఠానం చేస్తున్నారంటే వారి యోగ్యతా శ్రధ్ధాభక్తులే అందుకు కారణమనుకోవలసిందే. కాని ఇలాచేసి తీరవలసిందని వారినెవరు నిర్బంధించారు? తరతరాలుగా మన పూర్వు లీ నియమపాలనం చేస్తున్నారు. అదే మనకు ఆచారమయినది. శిష్టులనుచూచి ఇతరులు తమ నడవడిని దిద్దుకొంటూవుంటారు. తాత, తండ్రుల వరుసగా అదే సదాచారమై ప్రజలకు సమ్మాన్యమవుతుంది. మనఆచారాలన్నీ ఇలా సాంప్రదాయంగా వచ్చినవే కాని శాసనబద్ధము లయినవి కావు. చిరసమ్మాన్యమయిన యీ ఆచారసంప్రదాయాలకు భంగం కలిగినప్పుడు శిష్టుల పలుకుబడియే సంఘాన్ని హద్దులలో నిలిపి వుంచుతుంది. ప్రజలు విహితాచరణంపట్ల ప్రాలుమాలినా అకార్యాలుచేయకుండా వుండుటకు ఇదే కారణం. సంఘనియమాలకు నిలయమైన పల్లెలలో ప్రజలు నివసిస్తున్నంతకాలం శిష్ఠుల పలుకుబడి ఇలా చెల్లుతూవచ్చింది.

ప్రజలు పట్టణ వాసాలకు తరలిపోవటంతో సదాచార రక్షకులైన శిష్టుల పలుకుబడి తగ్గి సంఘానికి శైథిల్యం ప్రాప్తించింది. ఇతరప్రాంతాలకు విదేశాలకు వెళ్ళిన ప్రజలు అనేక వృత్తులు చేపట్టడంతో సంఘనియమాలు సడలిపోయి చిరాగతములయిన సత్సంప్రదాయాలు మరుగునపడిపోయినవి. రాజకీయపక్షాలకు కూడ నియమాలుంటవి. ఆ యా పక్షాల వారు వాటికి కట్టుబడి వుంటారు. ఆ నియమాలనుల్లంఘిస్తే దానికి కలిగే ఫరితానికి తలయొగ్గుతారు. మరి మతధర్మాలు, నియమాలు అనేసరికి ఎదురుతిరుగుతారు. ఈ కఠిన నియమాలు పాలించటం మావల్ల కాదంటారు.

బౌద్ధము, క్రైస్తవము, ఇస్లాము మున్నగు మతాలను, ఏతన్మతకర్తలు స్థాపింపక పూర్వమందున్నూ, మానవలోకమందేదో ఒక మతము ఉండివుండాలి. మానవలోకమంతటా ఆ పురాతనకాలమందు వైదికమతమే వ్యాపించివుండాలని అను మానించుట కాధారాలున్నవి. ఆ మతమే ఇతర ప్రాంతము లందు కాల క్రమేణ పలుచబడిపోయి మనదేశంలో మాత్రం ఘనీభూతమైందనుకోవాలి. ఆవైదిక ధర్మాలనే కొన్నింటిని ఈ నూతన మతాలాధారంగా గ్రహించి తమ సిద్ధాంతాల కనుగుణంగా ప్రాధాన్యాన్ని వాటికి కల్పించినవి. వైదిక మత మొక్కటే వుంటున్న కాలంలో అందరూ ఆ ధర్మాల ఆ ధర్మాలనే అనుసరిస్తూవుండేవారు. క్రైస్తవ, ఇస్లాము మతముల రాకతో పరమాత్మను ప్రార్ధించుటమనే ధర్మానికి ప్రాధాన్యం వచ్చింది. ఇది హైందవమతానికి, బౌద్ధ, జైనములకు ఒక్క మోక్షవిషయంలో తప్ప ఇతరధర్మములం దంతగా భేదం కనిపించదు.

హైందవసంఘం మత సంప్రదాయాలతో మునిగి తేలుతూ వుంటుంది. కర్మానుష్ఠానంపట్లమనకు ఆదరంఅధికం. దానిని విడనాడుటకు మనకు మనస్సొప్పదు. కర్మాచరణకు అనుకూలపరిస్థితులు లేకపోయెనే అని మనసులో బాధపడుతూ వుంటాము. కర్మలపట్ల జన బహుళ్యాని కేర్పడినఅలసతచే మన కర్మాభినివేశంకూడా సడలిపోతున్నది. అయితే మనమతానికిన్ని సంస్కారాలను, కర్మకాండను పెద్దలు ఎందుకువిధించారనే విషయంకూడా మన మాలోచించవలసివుంటుంది. తక్కిన కర్మకాండ నలా వదలి, ఒక్క వివాహసంస్కారాన్నీ దాని నియమాలనుగూర్చి ఆలోచించుదాము. అవివాహితయయిన కన్య ఈశ్వరుణ్ణ భర్తగాను, విహహితయైన పిమ్మట భర్తనే ఈశ్వరుడుగాను ఎంచుకోవాలన్నారు. వయసువచ్చిన కన్యలు కొంత కట్టుబాటుతో మెలగవలెనన్నారు. స్త్రీలు భర్తలతో చితి ఎక్కే ఆచారంకూడా ఒకటి వున్నది. భర్తృమరణానంతరం రాజపుత్రస్త్రీలు బ్రతుకునొల్లక అలా సహగమనం చేసేవారు. రావణుని చెరలోవున్నంకాలం శరీరాన్ని రక్షించుకున్న సీతాదేవి రాముడు తన శీలాన్ని శంకించిన పిమ్మట బ్రతుకును రోసి, అగ్ని ప్రవేశం చేసింది.

ఇతరమతములందు వివాహమనేది స్త్రీ పురుషుల మధ్య ఒడంబడిక వంటిది. ఆ ఒడంబడిక మితిచొప్పునవారొండొరుల యెడ విశ్వాసం కలిగి వుంటారు. అవసరమనితోస్తే వారిరువురకు విడిపోయే అధికారం కూడా వుంటుంది. సాంఘికములైన చిక్కులను పరిహరించుకోడానికి, కామసేవనానికి హద్దు పెట్టడానికి పనికివస్తుందా వివాహం. మరి మనమతంలో వివాహ మనేది ఆత్మోన్నతికై ఏర్పడిన సంస్కారం. పురుషు లిలా వివాహ సంస్కారంవల్ల మితంగాకామపురుషార్ధాన్ని సేవించి, మోక్షపురుషార్ధాన్ని సాధించుటకైగురువును ఆశ్రయించవలసి వుంటుంది. ఇక స్త్రీలకంటారా, కామసేవనానికి, అత్మోప లబ్ధికి గూడా వివాహమేసాధనం. స్త్రీలు ఉత్తమగతికోసం భర్తనే గురువుగా ఎంచుకుంటారు. భర్తనే దైవంగా ఎంచుకొని దేహాత్మలను రెంటినీ అర్పించి, సేవించుకుంటారు. భర్తృసేవయే స్త్రీలకీశ్వరసేవ, మన వివాహమందింతటి పరమార్ధమున్నది. కనుకనే భారతస్త్రీల పాతివ్రత్యం అంతగా గణుతికెక్కినది. ఇన్ని నియమాలతో కూడుకొన్నవివాహధర్మాన్ని మనస్త్రీలు మనఃపూర్వకంగా పాలిస్తూవచ్చారు. సత్కర్మయని నమ్మి ఆ కర్మాచరణమందు మనం త్యాగాధికం చేస్తూవుంటే ఆత్మోపలబ్ధి చేకూరుతూవుంటుంది. మూఢభక్తితో ఆచరించినా సత్కర్మలు ఫలమునిస్తూ వుంటవి. ఆ యీ కర్మలవల్ల ప్రయోజనమేమిటి అని మనం శంకిస్తున్నాము అంటే మనకు భక్తివిశ్వాసములు సన్నగిల్లుతున్నవన్నమాట.

మన పురాణములం దా యీ విషయాలను బోధించే అర్థవాదము లనేకంగా వున్నవి. వర్తమానపరిస్థతులను నేటి నవలలు తెలియచెప్పుతున్నట్లే పూర్వకాలపు సంఘ మర్యాదలు, ఆచారాలు మున్నగువాని పరమార్ధాన్ని పురాణాలు తెలియచెప్పుతవి. భర్తనే దైవముగా ఎంచుకొని, సర్వసమర్పణం చేసిన స్త్రీలకు, భర్త మరణానంతరం ఆ శరీరాలతో పనిలేదనేదే సహగమనమందలిపరమార్ధం. పురుషులకు ఉపనయనం వంటిదే స్త్రీలకు వివాహసంస్కారం. బాలురకు యేడవ యేటనే ఉపనయనం జరపాలి. మనసులో ఇతర కామచింతలు అడుగుపెట్టకముందే గాయత్రీ మంత్రజపంవారికి అలవరచాలి. అట్లే బాలికలకు ఇతరపురుష చింతలు మనసులో చొరబడక ముందే వివాహసంస్కారం జరగాలి. వయసు రాకముందే అలా వివాహంచేస్తే, వారి మనస్సులకు భర్తృచింతనమే అలవడుతుంది. భర్తనే దైవంగా ఎంచుకొని సేవించుకుంటారు. రజస్వలావివాహం చేసే కులాలవారుకూడా వయసువచ్చిన ఆడుబిడ్డలను వివాహమయ్యేవరకూ కొన్ని కట్టుబాట్లలో వుంచుతారనేది మనం గమనించాలి. పదిహేనేళ్ళు నిండకుండా బాలికలకు వివాహం చేయరాదనే శాసనం పుట్టిన పిమ్మట రజస్వలావివాహములు తప్పనిసరియైనవి. కాబట్టి రజస్వలలు కాకముందే బాలికలకు పెండ్లిచేసే ఆచారమున్నకులాలవారు రజస్వలా వివాహాచారం వున్న కులాలవా రీవరకు చేస్తున్నట్టే తమ ఆడబిడ్డలను కట్టుబాట్లలో పెంచవలసివుంటుంది. వారికి పెద్దచదువులు చెప్పించి, ఉద్యోగాల్లో ప్రవేశ##పెట్టక వివాహ పర్యంతం ఇంటిలోనే సదాచారాన్ని, నీతిసంపదను అలవరచే సద్గ్రంథాలతో కాలక్షేపం చేయిస్తూ వుండాలి.

మన ఆచారాల పరమార్థాన్ని గ్రహించినవారు వాటిని మౌఢ్యంక్రింద, అవివేకంక్రింద జమకట్టి తెగనాడరు. మనకు తెలియనివన్నీ పనికిమాలినవని పరిత్యజించటం కంటే శ్రద్ధాభక్తులతో అనువర్తించడంమేలు. సహగమనపరమార్థాన్ని ఎరుగని వారికి, అది క్రూరంగానే కనిపిస్తుంది. భర్తనుకోల్పోయిన స్త్రీ లందరూ సహగమనం చేస్తారా? చేయరు, చేయనూలేరు. అలా సహగమనం చేయలేక సంతానం మొదలైన బాధ్యతలున్న వారికోసమే విధవాధర్మమే చెప్పబడినవి.

ఆ యీ నియమాలన్నీ మన మేలుకోసమే పుట్టినవి. దొంగమేతల కలవడిన గోవును కట్టివుంచుతాము. అలాకట్టి వుంచటంవల్ల పంటలకు చెరుపూ తప్పిపోతుంది. ఆ గోవుకు పంటకాపులచే దెబ్బలూతప్పుతవి. అలాగే కామక్రోధపశులమై, తప్పుదారిని పడకుండా మనకూ కొన్ని బంధనములు అవసరం. కట్టియుంచిన గోవును ఎపుడు వదలవలెనో పసుల కాపరికి తెలుస్తుంది. మనలను బంధనములనుండి ఎపుడు తప్పించాలో పశుపతియైన ఈశ్వరునికే ఎరుక.

ఇతర బంధములనుండి తప్పించుటకే మనంకొన్ని బంధములు విధించుకోవాలి. ప్రత్తిబేళ్ళను మనం తాటితో బంధిస్తాము. పిమ్మట ఇనుపబద్దెలు వేసి దాన్ని యంత్ర సాహాయ్యంతో నొక్కుతాము. అటునొక్కగానే మొదటి కట్టుతాళ్ళు సడలి ఊడిపోతవి అట్లే మనలను సంసారముతో కట్టియుంచినకామ క్రోధములనే తాళ్ళు జ్ఞానమనే ఇనుపబద్దెలు బిగించినంతనే విడిపోతవి. యజ్ఞతపోధన కర్మాదులచే, మనకుజ్ఞానం లభిస్తుంది. మనం విహితకర్మానుష్ఠానం శ్రద్ధగాచేస్తూ, దాని ఫలమును ఈశ్వరార్పితం చేస్తే జ్ఞానప్రాప్తి. దానివల్ల ఈశ్వరప్రాప్తి లభిస్తుంది. కర్మానుష్ఠానము ఏమరక మనం త్యాగాదులచే పుణ్యమనే బంధమును సంపాదించుకుంటే పాపబంధములు విడిపోయి పరమాత్మజ్ఞానం కలిగి, చావుపుట్టుకలనే సంసారబంధం నుండి ముక్తిదొరుకుతుంది. ఈశ్వరార్పణబుద్ధిచే చేసే కర్మానుష్ఠానం వల్ల చిత్తనైర్మల్యం కలుగుతుంది. చిత్తశుద్ధిచే ఏకాగ్రత అలవడుతుంది. నిర్మలము, ఏకాగ్రము అయినచిత్తమునందు, ఈశ్వరసాన్నిధ్యం లభిస్తుంది. నిర్మలము, నిశ్చలము. అయిన అద్దమునందేకదా స్పష్టమైన ప్రతిబింబం కనుపించేది.

జ్ఞానాగ్ని యందు మనం సమస్తమును కాల్చివేయాలి. సంసారకారణ మేమిటాయని మనం వెనక్కు వెనక్కు వెళ్ళి విచారించినకొద్దీ నానాప్రకారమైన యీ జగత్తంతటికీ మూలమందు ఒకటే నిత్యపదార్థమున్నదని తెలిసివస్తుంది. చేతనా చేతనమైన సృష్టియంతటికీ మూలమైన మృత్తుకుచిహ్నంగానే ముఖములందు మనం తిరుమణి ధరిస్తున్నాము. కాలినపదార్థములు ముందు నల్లబడుతవి. ఇంకా కాలిస్తే తెల్లని బూడిద మిగులుతుంది. ఆ బూడిద నెంతకాల్చినా దానికి నాశనంలేదు. అవినాశియైన ఈ భస్మమే పదార్థముల కంత్యావస్థ భూత ప్రపంచానికీ భస్మమెట్టిదో ఆత్మప్రపంచానికి శివుడట్టివాడు. జ్ఞానాగ్ని యందు మనము సర్వమును పుటముపెట్టి పరీక్షిస్తే తుదకు భస్మమే మిగులుతుంది. ఇలా సృష్టికంతటికి పరుడైన శివునకు సంకేతంగా మనం దేహములందు భస్మము అలదికొంటాము నిలువుగా తీర్చిన తిరుమణిరేఖలు ఆత్మాధిరోహణము నుపదేశిస్తే, మేన అలదికొన్న భస్మము సర్వం శివ మయమని తోస్తుంది. కర్మానుష్ఠానం, శీలం, ఉపాసన, జ్ఞానం ఇవి. ఈశ్వరానుగ్రహానికి సోపానాలు. ఈ సాధన చతుష్టయాన్ని మనం అభ్యసించి, మనబిడ్డలకుకూడా అలవరచాలి. విహిత కర్మాచరణంచేస్తూ, భక్తి ప్రేమలచే జ్ఞానాగ్నిలో మన కోరికలను, తాపములను హోమంచేసి పరమాత్మానుభవము చేసుకొందుముగాక!

------- ఃఃః ---------

Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page